మిస్టర్ డీజీపీ.. కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చెయ్..నన్ను అంత అసభ్యంగా తిట్టినా సర్వీస్ నుంచి ఎందుకు తీసెయ్యలే: కవిత

మిస్టర్ డీజీపీ.. కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చెయ్..నన్ను అంత అసభ్యంగా తిట్టినా సర్వీస్ నుంచి ఎందుకు తీసెయ్యలే: కవిత
  • పరీక్ష పాసయ్యే డీజీపీ అయ్యారా.. చట్టాలేం చెప్తున్నాయో తెలుసా?
  • అతడిపై యాక్షన్‌‌‌‌ తీస్కోకపోతే అంతర్జాతీయ వేదికలపై సర్కారు పరువు తీస్తానని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: తనపై అసభ్య కామెంట్లు చేసిన కానిస్టేబుల్‌‌‌‌ను రాష్ట్ర డీజీపీ సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సర్వీస్ నుంచి రిమూవ్ చేయకుండా, కేసు పెట్టకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. అసలు పరీక్ష పాసయ్యే డీజీపీ అయ్యారా? ఆయనకు చట్టం తెలుసా అని నిలదీశారు. వెంటనే కానిస్టేబుల్‌‌‌‌పై చర్యలు తీసుకోకుంటే అంతర్జాతీయ వేదికల్లో ప్రభుత్వం పరువు తీస్తానని హెచ్చరించారు. ఆదివారం బంజారాహిల్స్‌‌‌‌లోని టీఆర్ఎస్ ఆఫీస్‌‌‌‌లో కవిత మీడియాతో మాట్లాడారు.

‘‘నాపై అసభ్యంగా కామెంట్స్​ చేసిన కానిస్టేబుల్‌‌‌‌పై కేసులు ఎందుకు పెట్టలేదు? భారత న్యాయ సంహిత సెక్షన్ 356, సెక్షన్ 79, ఐటీ చట్టాలు ఏం చెప్తున్నాయో డీజీపీ చదువుకోవాలి. మహిళల గురించి ఒక్క పదం అసభ్యంగా మాట్లాడినా సరే మూడేండ్ల శిక్ష వేసేలా చట్టాలున్నాయి. 20 ఏండ్లు ప్రజా జీవితంలో ఉండి.. ఎంపీ, ఎమ్మెల్సీ, ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తనకే రక్షణ లేకపోతే సాధారణ మహిళలకు ఏం రక్షణ ఇస్తారు. డీజీపీకి కూడా ఇద్దరు కోడళ్లున్నారు. వారిని ఇలాగే అంటే వదిలేస్తారా? మిస్టర్​ డీజీపీ.. నాపై అసభ్యంగా మాట్లాడిన కానిస్టేబుల్‌‌‌‌ను అరెస్ట్​ చెయ్’’ అని కవిత మండిపడ్డారు.

ఉద్యమకారులను వాడుకున్నరు 

అధికారంలోకి రావడానికి తెలంగాణ ఉద్యమకారులను రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నారని కవిత ఆరోపించారు. ఎన్నికలకు ముందుకు దాదాపు వాళ్ల కాళ్లు పట్టుకున్నంత పనిచేశారని అన్నారు. అధికారంలోకి వచ్చాక వాళ్లను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి.. తెలంగాణ ఉద్యమంతో సంబంధమే లేని రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మలేదని కవిత అన్నారు. పక్కన కోదండరాంను చూసి రేవంత్‌‌ను నమ్మారని అన్నారు.

అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా వాళ్లకోసం చీమకాలంత పనికూడా చేయలేదని విమర్శించారు. ఉద్యమకారుల కోసం తాము భూపోరాటం చేస్తే లాఠీలు ఝుళిపించారని కవిత గుర్తుచేశారు. టీజేఎస్ తరఫున ఉద్యమకారులకు ఐడెంటిటీలు కార్డులు ఇచ్చిన కోదండరాం.. వాటినే ఇప్పుడు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలన్నారు.